Friday ,June 26, 2026, 1:58 am
Kuhu World
HomeTopstories2జాతీయ విస్తరణ దిశగా పవన్ కల్యాణ్ కీలక అడుగులు! - ఢిల్లీ వేదికగా ప్రత్యేక సమావేశం

జాతీయ విస్తరణ దిశగా పవన్ కల్యాణ్ కీలక అడుగులు! – ఢిల్లీ వేదికగా ప్రత్యేక సమావేశం

spot_img
spot_img

న్యూఢిల్లీ:
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ జాతీయ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. ఈ వారం లో మూడు రోజుల పాటు జనసేన పార్టీ ప్రత్యేక విస్తృత స్థాయి సమావేశాలను నిర్వహిస్తోంది. జాతీయ సమగ్రత, దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ విస్తరణే ప్రధాన ఎజెండాగా సాగనున్న ఈ ప్రత్యేక సమావేశాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా రానున్న కొత్త తరం రాజకీయ అలల సవ్వడి గా భావించవచ్చు.
‘సేన ప్రస్థానం.. జాతీయ సమైక్యత కోసం’
సోమవారం (రేపు) ఉదయం ఢిల్లీలోని ప్రతిష్టాత్మక ‘అశోక హోటల్’ వేదికగా జనసేన పార్టీ విస్తృత స్థాయి ప్రతినిధుల సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశానికి “సేన ప్రస్థానం.. జాతీయ సమైక్యత కోసం” అనే ప్రత్యేక పేరును ఖరారు చేశారు.
జనసేన పార్టీ స్థాపించి పుష్కర కాలం (12 ఏళ్లు) పూర్తి చేసుకున్న సందర్భంగా.. ఈ కాలంలో జాతీయ సమైక్యత కోసం పార్టీ చేసిన కృషి, ప్రాంతీయతకు విలువ ఇస్తూనే దేశ సమగ్రత కోసం ఒక రాజకీయ పార్టీగా ఎలా నిలబడాలనే అంశాలపై పవన్ కల్యాణ్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.
ఢిల్లీలోని అశోక హోటల్లో సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు పవన్ కళ్యాణ్ ఆదివారమే ఢిల్లీ వెళ్తున్నారు. మంగళగిరి క్యాంపు కార్యాలయం నుంచి సాయంత్రం 4 గంటల 25 నిమిషాలకు పవన్ కళ్యాణ్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. నాలుగున్నర గంటలకు గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. రాత్రి 6:40 గంటలకు ఢిల్లీకి చేరుకున్న తర్వాత నేరుగా తాజ్ హోటల్‌కు వెళ్లనున్నారు.
ఢిల్లీకి చేరిన 150 మంది ముఖ్య నేతలు
దేశ రాజధానిలో జనసేన క్యాడర్ ఇంత పెద్ద ఎత్తున ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించడం ఇదే మొదటిసారి. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ నుండి జనసేన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నూతనంగా నియమితులైన కార్పొరేషన్ చైర్మన్లు సహా దాదాపు 150 మంది ముఖ్య నాయకులు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. వారితో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి ఇటీవల పార్టీలో చేరిన ముఖ్య నేతలు కూడా ఈ భేటీకి హాజరవుతున్నారు.
జాతీయ స్థాయికి ‘సేన గళం’.. పవన్ సరికొత్త పొలిటికల్ ఫిలాసఫీ
సమాజంలో బాధ్యతాయుతమైన రాజకీయ సంస్కృతిని పెంపొందించడం, కుల రాజకీయాలకు అతీతంగా అభ్యుదయ భావాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా పవన్ కల్యాణ్ ఇటీవలే ‘సేన గళం’ అనే ప్రత్యేక వేదికను ఏర్పాటు చేశారు.
  • పాతకాలపు బూజుపట్టిన కుల రాజకీయాలు, వ్యక్తిగత దూషణల సంస్కృతిని పక్కనపెట్టి, వాస్తవాలు మరియు ప్రజాహితం ఆధారంగానే రాజకీయాలు సాగాలన్నదే పవన్ కల్యాణ్ ప్రతిపాదన.
  • ముఖ్యంగా ‘జెన్ జీ’ (నేటి తరం యువత) ఆకాంక్షలకు అనుగుణంగా రాజ్యాంగ విలువల పరిరక్షణే ధ్యేయంగా ఈ ‘సేన గళం’ పనిచేయనుంది.
  • ఈ వినూత్న పొలిటికల్ ఫిలాసఫీని, జనసేన సిద్ధాంతాలను జాతీయ మీడియా ద్వారా దేశ ప్రజలకు పవన్ కల్యాణ్ వివరించనున్నారు.
పొరుగు రాష్ట్రాల్లో విస్తరణే టార్గెట్!
కేవలం ఆంధ్రప్రదేశ్‌కే పరిమితం కాకుండా జనసేనను జాతీయ పార్టీగా మార్చడమే లక్ష్యంగా జనసేన వ్యూహకర్తలు ప్లాన్ చేస్తునారు. తెలంగాణలో ఇప్పటికే కార్యకలాపాలు పెంచిన జనసేన.. ఇటీవల కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోనూ సభ్యత్వ నమోదు, చేరికలపై దృష్టి పెట్టింది. ఈ 3 రోజుల సమావేశాల్లో పొరుగు రాష్ట్రాల్లో పార్టీ సంస్థాగత బలోపేతం, భవిష్యత్తు కార్యాచరణపై పవన్ లోతుగా చర్చించనున్నారు.
ఎన్డీయే కూటమిలో బలమైన భాగస్వామిగా ఉన్న జనసేన, ఢిల్లీ వేదికగా నిర్వహిస్తున్న ఈ సదస్సు ద్వారా దక్షిణాదిలో తన మార్కు జాతీయవాదాన్ని బలంగా చాటాలని భావిస్తోంది. పర్యటన ముగింపు రోజున పవన్ కల్యాణ్ పలువురు జాతీయ స్థాయి నేతలతో కూడా భేటీ అయ్యే అవకాశం ఉంది.

బాచి
spot_img
spot_img
spot_img