HomeSpecials1సోషల్ మీడియా వేదికగా 'కె. అన్నామలై' చేసిన పూర్తి ప్రసంగం - తెలుగులో
సోషల్ మీడియా వేదికగా ‘కె. అన్నామలై’ చేసిన పూర్తి ప్రసంగం – తెలుగులో
తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కె. అన్నామలై ఈరోజు (జూన్ 5, 2026) మధ్యాహ్నం 12 గంటలకు సోషల్ మీడియా ద్వారా ప్రత్యక్ష ప్రసారంలో ప్రజలతో మాట్లాడారు.
బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన కొద్ది గంటలకే, ఆయన తన భవిష్యత్తు రాజకీయ ప్రణాళికను ప్రకటిస్తూ చేసిన ప్రసంగం/సందేశం యొక్క పూర్తి తెలుగు అనువాదం మీ కోసం ..
“నా ప్రియమైన తమిళనాడు ప్రజలకు, యువతీ యువకులకు, రైతులకు, తల్లులకు మరియు నా శ్రేయోభిలాషులకు నమస్కారం.
నిన్న నా పుట్టినరోజు సందర్భంగా మీరంతా చూపించిన అపారమైన ప్రేమ, ఆశీస్సులు నన్ను ఉద్వేగానికి గురిచేశారు. సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమం కోసం, ముఖ్యంగా తమిళనాడు భవిష్యత్తు కోసం మరింత అంకితభావంతో పనిచేసే శక్తిని మీ ప్రేమే నాకు ఇచ్చింది.
ఈరోజు మీ అందరితో మనస్ఫూర్తిగా, దాపరికం లేకుండా మాట్లాడాలని ఈ సోషల్ మీడియా వేదిక ద్వారా మీ ముందుకు వచ్చాను.
గత కొన్ని రోజులుగా నా రాజకీయ భవిష్యత్తుపై అనేక ఊహాగానాలు నడుస్తున్నాయి. వాటన్నింటికీ ఈరోజు స్వస్తి పలకాలనుకుంటున్నాను. భారతీయ జనతా పార్టీ (BJP) జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ గారు నా రాజీనామాను అధికారికంగా ఆమోదించారు. నాకు ఇన్నేళ్లుగా అండగా నిలిచిన కేంద్ర పెద్దలకు, అమిత్ షా గారికి, జాతీయ నాయకత్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
నేను ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది?
ఈ నిర్ణయం నేను ఒక్కరోజులో తీసుకున్నది కాదు. దీని వెనుక పెద్ద సంఘర్షణే నడిచింది. ‘నేను ఒక బీజేపీ కార్యకర్తనానా? లేక తమిళుడినా?’ అనే ప్రశ్న నాలో ఎప్పటికప్పుడు ఎదురవుతూనే ఉంది.
తమిళనాడు ప్రయోజనాలు, ఇక్కడి ప్రజల ఆకాంక్షల విషయంలో నా ఆలోచనలకు, పార్టీ జాతీయ నాయకత్వ దృక్పథానికి మధ్య స్పష్టమైన తేడా ఉందని నేను గ్రహించాను. మన రాష్ట్ర సమస్యలపై మనకున్న అవగాహన వేరు, ఢిల్లీ స్థాయి వ్యూహాలు వేరు.
ఇదే విషయాన్ని నేను గత ఏడాది డిసెంబర్ 4, 2025నే పార్టీ అధిష్ఠానానికి లిఖితపూర్వకంగా తెలియజేశాను. నేను పార్టీ నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నట్లు స్పష్టం చేశాను. అయితే, అప్పట్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున, ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు కొనసాగాలని అధిష్ఠానం నన్ను కోరింది.
వారి మాటను గౌరవించి, మే నెల వరకు నా బాధ్యతలను నిర్వర్తించాను. ఎన్నికల ఫలితాల తర్వాత, రెండు రోజుల క్రితం నేను స్వయంగా ఢిల్లీ వెళ్లి అమిత్ షా గారు, బి.ఎల్. సంతోష్ గారు, నితిన్ నబిన్ గారిని కలిసి నా నిర్ణయాన్ని మర్యాదపూర్వకంగా వివరించాను.
మన కొత్త ప్రయాణం – ‘వి ది లీడర్స్’ (We The Leaders)
ఈరోజు నేను ఒక సరికొత్త ప్రజా ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నానని ప్రకటించడానికి గర్విస్తున్నాను. దీని పేరు “వి ది లీడర్స్” (మనమే నాయకులం).
తమిళనాడు రాజకీయాల్లో మార్పు రావాల్సిన సమయం ఆసన్నమైంది. ఇన్నాళ్లూ ఇక్కడ సాగిన ‘వ్యక్తి పూజ’, ‘వారసత్వ రాజకీయాలకు’ కాలం చెల్లింది.
నాయకత్వం అనేది ఒకే కుటుంబం చేతుల్లోనో, ఒకే వ్యక్తి వద్దో బందీ కాకూడదు. ఈ నేలపై పుట్టిన ప్రతి సామాన్యుడు, ప్రతి యువకుడు ఒక నాయకుడు కావాలనేదే ఈ ఉద్యమ సంకల్పం.
మన సిద్ధాంతం చాలా స్పష్టం: “తమిళ మూలాలు – జాతీయ దృక్పథం” (Proud Tamil with an Indian identity). మనం గర్వించదగ్గ తమిళులం, అదే సమయంలో ఈ దేశ పౌరులం. ఈ రెండింటి మధ్య ఎలాంటి విభేదాలు లేవు. తమిళనాడు సంస్కృతిని కాపాడుకుంటూనే, దేశాభివృద్ధిలో మనం భాగస్వామ్యం కావాలి.
భవిష్యత్తు కార్యాచరణ:
కేవలం రాజకీయ పార్టీ పెట్టి ఓట్లు అడగడం నా లక్ష్యం కాదు. విలువలతో కూడిన రాజకీయాలు చేయడమే నా ధ్యేయం.
ఇందుకోసం మన మాజీ రాష్ట్రపతి, స్ఫూర్తిప్రదాత డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి పేరు మీద ఒక ప్రత్యేక రాజకీయ శిక్షణా కేంద్రాన్ని (Centre for Ethics and Politics) ప్రారంభిస్తున్నాం. ఇక్కడ యువతకు నిజాయితీ, నైతికతతో కూడిన రాజకీయాలపై శిక్షణ ఇస్తాం.
ఇలా తయారైన సరికొత్త సామాన్య నాయకులతో మనం రాబోయే తమిళనాడు స్థానిక సంస్థల ఎన్నికల్లో మరియు తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తాం. ఒక కొత్త రాజకీయ విప్లవానికి నాంది పలుకుతాం.
రాజకీయాల్లో, సమాజంలో నిజమైన మార్పును ఆశించే ప్రతి ఒక్కరికీ నేను పిలుపునిస్తున్నాను. రండి, మనమంతా కలిసికట్టుగా ఒక సరికొత్త, సంపన్నమైన, అవినీతి రహిత తమిళనాడును నిర్మిద్దాం. నాపై నమ్మకముంచి నాతో నడవడానికి సిద్ధంగా ఉండండి.
ధన్యవాదాలు.
జైహింద్ ! జై తమిళనాడు !“