కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన డి.కె. శివకుమార్ నేతృత్వంలోని నూతన కాంగ్రెస్ ప్రభుత్వం తన మంత్రివర్గ సహచరులకు పోర్ట్‌ఫోలియోలను (శాఖలను) కేటాయించింది.
గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ఆమోదంతో అధికారిక గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది.
పరిపాలనను వేగవంతం చేసే దిశగా అత్యంత కీలకమైన, వ్యూహాత్మక శాఖలను సీనియర్ మంత్రులకు అప్పగించారు. అయితే శాఖల పంపిణీ జరిగిన వెంటనే పార్టీలో అసంతృప్తి జ్వాలలు కూడా మొదలయ్యాయి.
మంత్రి పేరు |
కేటాయించిన శాఖలు |
డి.కె. శివకుమార్ (ముఖ్యమంత్రి) |
ఆర్థిక శాఖ, ఇంటెలిజెన్స్, కేబినెట్ వ్యవహారాలు, పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ మరియు ఇతర కేటాయించని శాఖలు. |
జి. పరమేశ్వర (ఉప ముఖ్యమంత్రి) |
రెవెన్యూ (భూకమతాల విభాగం) మరియు క్రీడా మంత్రిత్వ శాఖ. |
ప్రియాంక్ ఖర్గే |
హోం శాఖ (ఇంటెలిజెన్స్ మినహా), ఐటీ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ), బయోటెక్నాలజీ మరియు ఈ-గవర్నెన్స్. |
కృష్ణ బైరెగౌడ |
గ్రేటర్ బెంగళూరు అభివృద్ధి (BBMP, BDA, మెట్రో, వాటర్ సప్లై సంస్థల పర్యవేక్షణ). |
యతీంద్ర సిద్ధరామయ్య |
పట్టణాభివృద్ధి శాఖ (వాటర్ సప్లై, డ్రైనేజీ బోర్డు, లోకల్ ప్లానింగ్ అథారిటీలు). |
రామలింగారెడ్డి |
భారీ మరియు మధ్యతరహా నీటిపారుదల శాఖ. |
కేహెచ్ మునియప్ప |
ఆహారం, పౌర సరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాలు. |
కేజే జార్జ్ |
ఇంధనం మరియు పర్యాటక శాఖ. |
ఎంబీ పాటిల్ |
భారీ పరిశ్రమలు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి. |
ఈశ్వర్ ఖండ్రే |
గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీ రాజ్ శాఖ. |
సతీష్ జార్కిహోళి |
ప్రజా పనుల శాఖ (PWD). |
తొలిరోజే మొదలైన అసంతృప్తి సెగలు
శాఖల కేటాయింపు ప్రకటన వెలువడిన వెంటనే కర్ణాటక కాంగ్రెస్‌లో రాజకీయ వేడి రాజుకుంది. బెంగళూరు అభివృద్ధి శాఖను ఆశించిన సీనియర్ నేత, మంత్రి రామ లింగారెడ్డి తనకు ఆ శాఖ దక్కకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఆయనకు భారీ, మధ్యతరహా నీటిపారుదల శాఖను కేటాయించగా, బెంగళూరు బాధ్యతలను కృష్ణ బైరెగౌడకు అప్పగించారు. ఈ పరిణామంతో తీవ్ర ఆవేదనకు గురైన రామలింగారెడ్డి, తనకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదంటూ తన మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.
ఈ వివాదాన్ని సద్దుమణిగించేందుకు ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ విధానసౌధలో అత్యవసర చర్చలు జరిపారు. హైకమాండ్ కూడా ఈ విషయంలో జోక్యం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
– బాచి






