Sunday ,April 20, 2025, 1:52 am
Kuhu World
HomeBusiness2తులం రూ. 72,000 - ఈ ఏడాది సరికొత్త శిఖరాలకు పసిడి ధరలు!

తులం రూ. 72,000 – ఈ ఏడాది సరికొత్త శిఖరాలకు పసిడి ధరలు!

spot_img

బంగారం ధరలు మున్ముందు మరింతగా పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఇప్పటికే రికార్డు స్థాయిల్లో కదలాడుతున్న పుత్తడి విలువ.. ఈ ఏడాది సరికొత్త శిఖరాలనే అధిరోహిస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ క్రమంలోనే ఈ సంవత్సరం 10 గ్రాములు రూ.72,000 పలుకుతుందన్న అంచనా ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

దేశ, విదేశీ స్టాక్‌ మార్కెట్ల తీరుతెన్నులు, భౌగోళిక రాజకీయ పరిస్థితులు, ఆయా దేశాల సెంట్రల్‌ బ్యాంకుల విధానాలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు, డాలర్‌ ఇండెక్స్‌, భారత్‌సహా పలు ప్రధాన దేశాల్లో ఎన్నికలు.. కలిసి పసిడి ధరల్ని ఎగదోయవచ్చన్న విశ్లేషణలు ఇప్పుడు వస్తున్నాయి.


ఆకర్షణీయంగా..
బంగారం అంటే ఇప్పుడు ఓ పెట్టుబడి. ఒకప్పుడు కేవలం అలంకరణలో భాగంగానే ఉన్న పుత్తడి.. నేడు అంతకుమించేనని చెప్పకతప్పదు. అందుకే భౌతిక రూపం నుంచి పత్రాలు, డిజిటల్‌గానూ గోల్డ్‌ మారిపోయింది.

మదుపరులకు బంగారం ఓ సురక్షిత పెట్టుబడి సాధనంగా తయారైందంటే విషయాన్ని అవగతం చేసుకోవచ్చు. ఇందుకు తగ్గట్టే గత ఏడాది మదుపరులకు బంగారంపై పెట్టుబడులు దాదాపు 15 శాతం రాబడుల్ని అందించాయి.

దీంతో ఈ ఏడాది కూడా ఇన్వెస్టర్లకు గోల్డ్‌ అత్యంత ఆకర్షణీయమనే చెప్పుకోవచ్చని మెజారిటీ ట్రేడర్లు అంటున్నారు.

ముఖ్యంగా ఈ ఏడాది అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌.. తమ వడ్డీరేట్లను కనీసం మూడుసాైర్లెనా తగ్గించనుందన్న అంచనాలున్నాయి. ఇదే జరిగితే అమెరికా బాండ్‌ ఈల్డ్స్‌ మరింత పడిపోవడం ఖాయం. ఈ పరిణామం చివరాఖరికి పుత్తడి ధరలు పెరిగేందుకే దారితీస్తుందని చెప్తున్నారు.


సెంట్రల్‌ బ్యాంకులతో..
పసిడి విషయంలో ఆయా దేశాల సెంట్రల్‌ బ్యాంకులు వ్యవహరిస్తున్న తీరు కూడా మార్కెట్‌లో ధరల్ని పెంచేస్తున్నది.

అంతర్జాతీయ పరిణామాలతో దేశ ఆర్థిక వ్యవస్థకు ముప్పు వాటిల్లకుండా రిజర్వ్‌ బ్యాంకులు బంగారాన్నే రక్షణ కవచంగా ఎంచుకున్నాయి.

గత 13 ఏండ్లుగా రిజర్వ్‌ బ్యాంకుల వద్ద స్థిరంగా పెరుగుతున్న పసిడి నిల్వలే ఇందుకు నిదర్శనం. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) వద్ద కూడా పెద్ద ఎత్తునే గోల్డ్‌ రిజర్వులున్నాయి. నిరుడు సెప్టెంబర్‌ ఆఖరు నాటికి 807 టన్నుల బంగారం ఉన్నట్టు అంచనా.

అమెరికా, చైనా, జపాన్‌తోపాటు ఆయా యూరో దేశాలూ భారత్‌ కంటే ఎక్కువే బంగారం నిల్వల్ని పోగేశాయి. ఇక సెంట్రల్‌ బ్యాంకుల వడ్డీరేట్ల పెంపుతో ప్రపంచ ఆర్థిక వృద్ధిరేటు మందగిస్తున్నదని అంతర్జాతీయ ద్రవ్యనిధి చెప్తున్నది.

దీంతో మదుపరులు తమ పెట్టుబడులను ఇంకాస్త పసిడి వైపు మళ్లిస్తున్నారని, ఫలితంగా డిమాండ్‌ పెరిగి రేట్లు రికార్డుల్ని సృష్టిస్తున్నాయన్న వాదనలూ ఉన్నాయి. మిడిల్‌ఈస్ట్‌, రష్యా-ఉక్రెయిన్‌ ఆందోళనలూ బంగారం రేట్లకు రెక్కల్ని తొడుగుతున్నాయని ఇంకొందరి అభిప్రాయం.


ఆగని రికార్డు పరుగులు
బంగారం ధరలు వరుస రికార్డుల్ని నెలకొల్పుతున్నాయి. గురువారం ఢిల్లీలో 24 క్యారెట్‌ 10 గ్రాములు మరో రూ.500 పుంజుకొని రూ.65,650 వద్దకు చేరింది.

దీంతో నూతన ఆల్‌టైమ్‌ హై రికార్డు ఏర్పడింది. హైదరాబాద్‌లోనూ 24 క్యారెట్‌ పసిడి తులం రూ.430 ఎగిసి రూ.65,560గా ఉన్నది. 22 క్యారెట్‌ రూ.400 ఎగబాకి రూ.60,100 పలికింది. ఇక కమోడిటీస్‌ మార్కెట్‌లో కోమెక్స్‌ స్పాట్‌ గోల్డ్‌ ఔన్సు విలువ ఏకంగా 2,161.50 డాలర్లకు చేరింది.

ఈ క్రమంలోనే ఒకానొక దశలో తులం రూ.67వేలదాకా పలికింది. వెండి 24.10 డాలర్లుగా ఉన్నది. ఫెడ్‌ రిజర్వ్‌ చీఫ్‌ జెరోమ్‌ పావెల్‌.. ఈ ఏడాది వడ్డీరేట్లు తగ్గుతాయని పునరుద్ఘాటించడమే ఇందుకు కారణమని ట్రేడర్లు విశ్లేషిస్తున్నారు.

అలాగే వెండి కిలో ఢిల్లీలో రూ.400 పెరిగి రూ.74,900గా ఉన్నది. హైదరాబాద్‌లో రూ.500 అందుకుని రూ.78,500 పలికింది.

ఈ నేపథ్యంలో ఈ ఏడాది చివరికల్లా కిలో రూ.90,000 దరిదాపుల్లోకి వెళ్లవచ్చన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. పరిశ్రమల నుంచి డిమాండ్‌ పెరుగుతుండటమే ప్రధాన కారణమని చెప్తున్నారు.


 

spot_img
spot_img