మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన భక్త కన్నప్పను భారీ స్థాయిలో తీయబోతోన్నారు. మోహన్ బాబు ఈ సినిమా ప్రారంభోత్సవంలో చెప్పిన మాటలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి.
నూట యాభై కోట్ల భారీ బడ్జెట్‌తో సినిమాను తీయబోతోన్నామని ప్రకటించారు. ఇందులో మీరు ఊహించని వారంతా నటిస్తారు.. అంటూ చెప్పిన మాటలు ఇప్పుడు నిజమనే అనిపిస్తున్నాయి. ప్రభాస్ ఈ సినిమాలో నటిస్తాడనే వార్తను మంచు విష్ణు చెప్పకనే చెప్పేశాడు.
బాలీవుడ్ నుంచి కూడా భారీ తారాగణం ఈ సినిమా కోసం రంగంలోకి దిగబోతోన్నట్టుగా సమాచారం అందుతోంది. ఈ మూవీని న్యూజిలాండ్‌లోనే తీస్తామని, ఇక్కడి వాతావరణ పరిస్థితులు అనుకూలించవని, అందుకే అక్కడికి వెళ్లి షూట్ చేస్తామని మంచు విష్ణు చెప్పిన సంగతి తెలిసిందే.
అసలే ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా, పాన్ వరల్డ్ అంటూ ఆ స్థాయి సినిమాలనే చేస్తున్నాడు. అలాంటి కథలే, అలాంటి పాత్రలనే ఓకే చేస్తున్నాడు. ఇలాంటి టైంలో భక్త కన్నప్ప సినిమాలో కేవలం ఒక పాత్రను చేసేందుకు అంగీకరించడంతో ఒక్కసారిగా సినిమా మీద అంచనాలు పెరిగాయి.
ఆ పాత్ర ఏంటి? ఎలా ఉంటుంది? అసలు షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుద్ది? అని సినీ అభిమానుల్లో చర్చ మొదలయింది.
ప్రభాస్ ఓ పాత్రను పోషిస్తున్నాడనే వార్త ఇలా బయటకు రావడం, దాని మీద విష్ణు స్పందిస్తూ కన్ఫామ్ చేయడం, హర హర మహాదేవ్ అంటూ హింట్ ఇవ్వడంతో ప్రభాస్ ఆ ఈశ్వరుడి పాత్రలో కనిపిస్తాడని అంతా అనుకుంటున్నారు. మరి మున్ముందు ఈ భక్త కన్నప్ప నుంచి ఎలాంటి సర్ ప్రైజ్‌లు వస్తాయో వేచి చూడాలి.






