మంత్రి కొండా సురేఖ 23న కోర్టుకు హాజరు కావాలంటూ ప్రజాప్రతినిధుల కోర్టు మేజిస్ట్రేట్ శ్రీదేవి గురువారం ఉత్తర్వులు జారీచేశారు.
అక్కినేని నాగార్జున దాఖలు చేసి న పరువు నష్టం పిటిషన్‌పై వాంగ్మూలాలను నమోదు చేసిన కోర్టు ప్రత్యర్థికి అవకాశం కల్పించింది.
222 బీఎన్‌ఎస్‌ఎస్ రెడ్‌విత్, 223 బీఎన్‌ఎస్‌ఎస్ ప్రకారం ప్రత్యర్థి సంజాయిషీ స్వీకరించేందుకు వీలు కల్పించింది. 23న మంత్రి కొండా సురేఖ కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.
అనంతరం కేసు నమోదు చేయాలా? వద్దా? అనే అంశాన్ని కోర్టు పరిశీలిస్తుంది. మంత్రికి లంగర్‌హౌస్ పోలీసులు నోటీసులు జారీ చేయనున్నారు.
మంత్రి సురేఖపై పరువునష్టం దావా..
స్థాయి మరచి దిగజారుడు వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురే ఖపై బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పరువు నష్టం దావా వేశారు.
గురువారం నాంపల్లిలోని మనోరంజన్ కోర్టు ప్రాంగణంలో ఉన్న ప్రజాప్రతినిధుల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసం నిరాధారమైన ఆరోపణలు చేశారని పేర్కొన్నారు.
బీఎన్‌ఎస్ సెక్షన్ 356 కింద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు.
కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై పరువు నష్టం దావా వేస్తానని కేటీఆర్ గతంలోనే లీగల్ నోటీసులు ఇచ్చారు. వారం రోజుల్లోగా బహిరంగ క్షమాపణ చెప్పాలని నోటీసుల్లో పేరొన్నారు.
ఇచ్చిన గడువు ముగిసిన నేపథ్యంలో మంత్రిపై పరువు నష్టం దావా వేసినట్టు తెలిపారు. తాను ఐదోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని, తొమ్మిదేండ్లకుపైగా రాష్ట్ర మంత్రిగా పనిచేశానని పిటిషన్‌లో కేటీఆర్ పేర్కొన్నారు.
ప్రస్తుతం సిరిసిల్ల నియోజక వర్గ ఎమ్మెల్యేగా, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్నానని తెలిపారు. రాష్ర్టానికి ప్రపంచ దేశాలనుంచి పెట్టుబడులు సాధించేందుకు రాష్ట్రం తరఫున విదేశాల్లో జరిగిన అనేక సమావేశాలకు హాజరయ్యానని తెలిపారు. రాష్ట్ర పురోగతికి అంకితభావంతో పనిచేసి పలు సంక్షేమ పథకాల అమలుకు కృషి చేసినట్టు చెప్పారు.
ఈ క్రమంలో పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు సైతం అందుకున్నట్టు పిటిషన్‌లో పేర్కొన్నారు. అలాంటి తనపై మంత్రి సురేఖ నిరాధార ఆరోపణలు చేశారని, ఆమె వ్యాఖ్యలు తన పరువుకు భంగం కలిగించేవిగా ఉన్నాయని పేర్కొన్నారు.
ఆమె చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మీడియాలో వచ్చిన వార్తలను, సోషల్ మీడియాలోని కథనాలను, పలు టీవీ ఛానల్లో వచ్చిన వార్తలను పెన్‌డ్రైవ్‌లో నిక్షిప్తంచేసి కోర్టుకు సమర్పించారు. పత్రికల్లో వచ్చిన క్లిపింగ్‌లను, ఫోటోలను పిటిషన్‌కు జోడించి దాఖలు చేశారు.
కొండా సురేఖ గతంలో కూడా ఇలాంటి అడ్డగోలు వ్యాఖ్యలు చేసి, ఎన్నికల సంఘంతో చీవాట్లు తిన్న విషయాన్ని కూడా పిటిషన్‌లో ప్రస్తావించారు.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలను రాజకీయపరమైన వ్యాఖ్యలుగా మాత్రమే కాకుండా ప్రణాళికబద్ధంగా చేసిన కుట్రగా చూడాలని కేటీఆర్ తన పిటిషన్‌లోవిజ్ఞప్తి చేశారు. సురేఖ చేసిన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకొని, వాటి వెనుక ఉన్న నేరపూరిత దురుద్దేశాల పరిగణలోకి తీసుకొని, ఆమెకు చట్ట ప్రకారం శిక్ష వేయాలని కోర్టును కోరారు.
త్వరలోనే పరువు నష్టం తాలూకు సివిల్ దావాను సైతం కేటీఆర్ నమోదు చేసే అవకాశం ఉన్నదని బీఆర్‌ఎస్ వర్గాలు తెలిపాయి.