విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఈ రోజు (గురువారం/ అష్ఠమి తిథి) అమ్మవారు దుర్గాదేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు.
ఆలయానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి పూజల్లో పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని పులకించారు.
దుర్గముడనే రాక్షస సంహారం చేసిన శక్తిస్వరూపం దుర్గాదేవి. కోటిసూర్య ప్రభలతో వెలుగొందే ఈ దేవి భక్తులను సర్వదుర్గతుల నుంచి కాపాడుతుంది. ఈమె మహా ప్రకృతి స్వరూపిణి.
ఈ తల్లి ఉపాసన ద్వారా ఈతి బాధలు నశిస్తాయి. గ్రహబాధలు తొలగుతాయి. ఎర్రని వస్త్రాలు ధరించి, ఎర్రని పూలు, అక్షతలతో అమ్మను పూజించి, పులగం నివేదన చేయాలి.
ఓం దుం దుర్గాయై నమః అనే మంత్రాన్ని జపిస్తారు. దుర్గాసూక్తం, లలిత అష్టోత్తరం, దుర్గాస్తోత్రాలు పారాయణ చేస్తారు. గో పూజ చేసినా, వేదపండితులను సత్కరించినా అమ్మ సంతోషిస్తుంది.
నవదుర్గా సాంప్రదాయంలో – ఈ రోజు అమ్మను మహాగౌరి రూపంతో ఆర్చిస్తారు.