న్యూయార్క్: ఐక్యరాజ్యసమతి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యహూ(PM Benjamin Netanyahu) మాట్లాడారు.
పోడియం మీదకు వెళ్లిన ఆయన తన చేతుల్లో ఉన్న రెండు మ్యాప్‌లను ప్రదర్శించారు.
కుడి వైపు ఉన్న మ్యాప్‌లో -మిడిల్ ఈస్ట్‌తో పాటు ఇరాన్, ఇరాక్, సిరియా, యెమెన్ దేశాలకు నలుపు రంగు పెయింట్ వేశారు. ఆ మ్యాప్‌పై ద కర్స్(శాపం) అని రాసి ఉన్నది.
ఒక ఎడమ చేతిలో ఉన్న మ్యాప్‌లో ఈజిప్ట్, సుడాన్, సౌదీ అరేబియా, ఇండియా దేశాలు ఉన్నాయి. ఆ మ్యాప్‌పై ద బ్లెస్సింగ్(దీవెన) అని రాసి ఉన్నది.
అయితే ఆ రెండు మ్యాపుల్లోనూ .. పాలస్తీనా ఆనవాళ్లు లేవు. గ్రీన్ మ్యాప్ లేదా బ్లాక్ కలర్ మ్యాపుల్లో .. పాలస్తీనాను చూపించకపోవడం గమనార్హం.
నెతాన్యహూ ప్రసంగిస్తూ.. ప్రస్తుత పరిస్థితికి ఇరాన్ కారణమన్నారు.
ఇరాన్‌తో పాటు దాని మిత్రదేశాలు యుద్ధానికి ఆజ్యం పోస్తున్నట్లు ఆయన ఆరోపించారు.
ఇక గ్రీన్ మ్యాప్‌లో ఉన్న దేశాలు ఇజ్రాయిల్‌తో సన్నిహిత సంబంధాలు పెట్టుకుని ఉన్నట్లు నెతాన్యహూ తెలిపారు.
లెబనాన్, సిరియా, యెమెన్ దేశాల్లో జరుగుతున్న హింసకు ఇరాన్ ప్రధాన కారణమని తెలిపారు. లెబనాన్‌లోని హిజ్‌బొల్లాకు, గాజాలోని హమాస్‌కు, యెమెన్‌లోని హౌతీలకు ఆర్థిక, మిలిటరీ సహకారాన్ని ఇరాన్ అందిస్తున్నట్లు ఆరోపించారు. ఇరాన్ మిత్రదేశాల నుంచి తమ భూభాగాన్ని రక్షించుకుంటున్నట్లు ఇజ్రాయిల్ ప్రధాని పేర్కొన్నారు.
ఒకవేళ మీరు దాడి చేస్తే, అప్పుడు మేం తిరిగి దాడి చేస్తామని ఇరాన్‌కు వార్నింగ్ ఇచ్చారు.
యూఎన్ జనరల్ అసెంబ్లీలో నెతాన్యహూ మాట్లాడుతున్న సమయంలో కొందరు దౌత్యవేత్తలు నిరసనతో వాకౌట్ చేశారు. ఇరాన్ దూకుడు వల్లే లెబనాన్, గాజాలపై అటాక్ చేయాల్సి వచ్చిందని నెతాన్యహూ చెప్పారు.
నెతాన్యహూ పట్టుకున్న గ్రీన్ మ్యాప్‌లో ఇండియా ఉండడం గమనార్హం. ఇండియాతో తమకు మంచి రిలేషన్స్ ఉన్నాయని చెప్పేందుకు ఆ మ్యాప్‌లో ఇండియాను చూపించినట్లు తెలుస్తోంది.
ఇటీవల ఇండియా, ఇజ్రాయిల్ మధ్య సత్సంబంధాలు నెలకొన్నాయి. డిఫెన్స్, టెక్నాలజీ రంగంలో రెండు దేశాలు వాణిజ్యం పెంచుకున్నాయి.
పాలస్తీనా స్వయంప్రతిపత్తికి ఇండియా సపోర్టు ఇస్తున్నది. అయితే అదే సమయంలో ఇజ్రాయిల్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగిస్తున్నది.