భాద్రపదమాసంలో శుక్లపక్షంలో వినాయక చవితి పర్వదినాన్ని జరుపుకుంటాం. ఇక బహుళపక్షంలో కృష్ణపక్షం పితృకార్యాలకు విశేషం.
భాద్రపద బహుళ పాడ్యమి నుంచి భాద్రపద అమావాస్య వరకు ఉన్న రోజులను – మహాలయపక్షాలుగా పిలుస్తారు. భాద్రపదంలో వచ్చే అమావాస్యను మహాలయ అమావాస్యగా పేర్కొంటారు.
ఏడాదికి 12 అమావాస్యలుంటాయి. కానీ, భాద్రపద అమావాస్యకు ఎంతో విశిష్ఠత ఉన్నది.
ఈ ఏడాది ఈ నెల 18 నుంచి మహాలయ పక్షాలు ప్రారంభమై.. అక్టోబర్ 2వ తేదీతో ముగియనున్నాయి.
ఈ మహాలయ పక్షంలో ఉదయం ఇంటి ప్రధాన ద్వారం ఎదుట లోపల నిలబడి చేతులను జోడించి.. పితృ దేవతలను సర్మించుకోవాలి.
తద్వారా ఆయుః ఆరోగ్యం, ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. తాను పితృపక్షం పాటించేందుకు అశక్తుడనని.. నన్ను మన్నించి.. మీ దీవెనలు అందజేయాలని అంటూ మనః పూర్వకంగా ప్రార్థనం చేయడం వల్ల అనేక శుభ ఫలితాలు ఉంటాయి.
పితృదేవతల ఆకలి తీర్చడమే..
మహాలయ పక్షాలు పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు నిర్వహించేందుకు ఈ పక్షం అత్యంత శ్రేష్ఠమైందిగా వ్యవహరిస్తుంటారు.
పితృదేవతలకు ప్రీతికరమైనవిగా ఈ పక్షం రోజుల్లో పితృదేవతలకు తర్పణ, శ్రాద్ధ విధులను తప్పనిసరిగా శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.
కుదరని పక్షంలో తమ పితృదేవతలు ఏ తిథిరోజైతే కన్నుమూశారో ఈ పక్షంలో వచ్చే అదే తిథినాడు శ్రాద్ధం నిర్వర్తించాలి. ఒకవేళ తిథి రోజున వీలు కాకపోయినా అమావాస్య రోజున పిండ ప్రధానాలు చేయడం మంచిది.
తండ్రి జీవించి.. తల్లిని కోల్పోయిన వారు ఈ పక్షంలో పితృపక్షాల్లో నవమి రోజున తర్పణలు, శ్రాద్ధ విధులను ఆచరించాల్సి ఉంటుంది.
తలిదండ్రులు ఇద్దరూ లేనివారు మహాలయ పక్షంలో తప్పనిసరిగా పితృకర్మలు చేయాలి. పక్షం రోజుల్లో చేయలేని వారు కనీసం పితృ అమావాస్య రోజైనా తర్పణలు చేయాలి. మరణించిన పితృదేవతలకు భక్తిగా ఆహారాన్ని అందించి.. వారి ఆకలి తీర్చడమే ఈ మహాలయ పక్షాల ముఖ్య ఉద్దేశం.
కర్ణుడే భూమిపైకి వచ్చి..
మహాభారతంలో దానశీలిగా పేరుగాంచిన కర్ణుడు మరణం అనంతరం స్వర్ణలోకవాసం ప్రాప్తించింది. స్వర్గలోకం వెళ్తున్న సమయంలో ఆయనకు మార్గమధ్యలో ఆకలి దప్పికలు కలిగాయి.
ఇంతలో ఓ పండ్ల చెట్టు కనిపించింది. ఆ చెట్టుకు ఉన్న పండు కోసి తినబోతుండగా.. ఒక్కసారిగా బంగారంగా మారిపోయింది. ఆ ఒక్కటే కాదు.. ఎన్నిసార్లు పండ్లు కోసి తినేందుకు ప్రయత్నించినా అదే అనుభవం ఎదురైంది. చివరకు కనీసం దప్పిక అయినా తీర్చుకుందామనుకుని సెలయేరు వద్దకు వెళ్లాడు. దోసిటిలోకి నీటిని తీసుకొని నోటిముందర ఉంచగానే నీరు కూడా బంగారంగా మారిపోయింది. స్వర్గ లోకం వెళ్లినా ఆయనకు అదే పరిస్థితి ఎదురైంది.
దాంతో ఆ దానశీలికి తాను ఏం తప్పు చేశానని.. నాకు ఎందుకు ఇలా జరుగుతుందని బాధపడుతున్నాడు. ఈ సమయంలో ‘కర్ణా..! నువ్వు దానశీలిగా ఎంతో పేరు సాధించావు. చేతికి ఎముక లేకుండా దానాలు చేశారు. ఆ దానాలన్నీ బంగారం, వెండి, డబ్బు రూపేణా చేశావు. ఒక్కరికి అన్నంపెట్టి ఆకలి తీర్చలేకపోయావు. అందుకేనీకి దుస్థితి ప్రాప్తించింది’ అంటూ అశరీరవాణి పలికింది.
కర్ణుడు భూమిపైకి వచ్చి తిరిగి వెళ్లిన పక్షం రోజులనే
దాంతో కర్ణుడు తనతండ్రి అయిన సూర్యుడి వద్దకు వెళ్లి తనను భూమిపైకి పంపాలని ప్రాధేయపడ్డాడు. సూర్యుడి వినతి మేరకు దేవేంద్రుడు కర్ణుడిని భూమిపైకి వెళ్లేందుకు అవకాశం ఇస్తాడు.
వెంటనే భూలోకానికి వెళ్లి అక్కడ అన్నార్తులందరికీ అన్నం పెట్టి , మాతాపితరులకు తర్పణలు వదిలి తిరిగి రావాలని చెప్పాడు.
ఈ క్రమంలోనే కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యమి రోజున భూమిపైకి చేరుకున్నాడు. పేదలు, బంధుమిత్రులు అందరికీ అన్నసంతర్పణ చేశాడు.
పితృ దేవతలకు తర్పణలు వదిలి.. తిరిగి అమావాస్య రోజున స్వర్గానికి చేరుకున్నాడు. ఎప్పుడైతే కర్ణుడు అన్న సంతర్పణలు , పితృ తర్పణాలు చేశాడో ఆ సమయంలోనే ఆయన ఆకలి తీరిపోయింది.
కర్ణుడు భూమిపైకి వచ్చి తిరిగి వెళ్లిన పక్షం రోజులనే మహాలయ పక్షమనే పేరు వచ్చింది. ఈ పక్షంలో వచ్చే చివరి రోజే అమావాస్యగా పిలుస్తారు.
ప్రతి ఒక్కరూ కులమతాలకు అతీతంగా కుటుంబంలో మరణించిన వ్యక్తులు, స్నేహితులు, గురువులు, పితృదేవతలందరికీ తిల శ్రాద్ధం సమర్పించాలి. ఫలితంగా వారి అనుగ్రహం లభిస్తుంది.