ప్రతి సంవత్సరమూ – భాద్రపద బహుళ తదియ – నాడు నోచుకునే నోము ఉండ్రాళ్ళ తదియ. ఇది రెండ్రోజుల పండుగ .
- ముందు రోజు —
ఐదుగురు ముత్తైదువులకి – గోరంటాకు ముద్ద ,పసుపు కుంకుమలు ,కుంకుడు కాయలు ,నువ్వులనూనె – ఇచ్చి మాయింటికి తాంబూలము తీసుకోవటాని కి రండి అని ఆహ్వానించాలి.
ఉండ్రాళ్ల తదియ వ్రతం చేసుకునే వారు సూర్యోదయానికి ముందుగానే నిద్ర లేచి అభ్యంగన స్నానం చేయాలి. ఆ తరువాత ఈ రోజు ఉండ్రాళ్ల తదియ వ్రతం చేస్తానని, రోజంతా ఉపవాసం ఉంటానని గౌరీ దేవి సమక్షంలో దీక్ష తీసుకోవాలి.
తలంటు అనగానే ఏదో షాంపుతో కాకుండా కుంకుడుకాయల రసం తో తలని రుద్దుకోవాలి. ఆ కుంకుడులోని దేదుతనం క్రిముల్నీ, కీటకాలనీ జుట్టులోనికి రానీయదు .
జుట్టులోని తడిని పిడవ (మెత్తని తుండుని చుట్టుకోవడం) ద్వారా బాగా పీల్చుకునేలా చేసుకుని సాంబ్రాణి పొగని పట్టించుకోవాలి .
సాంబ్రాణి తో మంచి సువాసనే కాకుండా .. తల తడిసిన కారణం గా శిరోజాల మూలాల వద్ద వున్న తడి పూర్తిగా ఆరిపోతుంది .
ఇక గోంగూరపచ్చడితో పెరుగన్నాన్ని తినిపిస్తారు …
పిల్లలందరికీ. ఈ తతంగమంతా ఉ 6 గంటలకే పూర్తవ్వాలి. ఇక్కడితో ఈ రోజు పండుగ ముగిసినట్లే.
వైద్య రహస్యము
ఆయుర్వేద శాస్త్రం ప్రకారము గోంగూర లో ఎన్నో పోషకాలు, విటమీన్స్, మినేరల్స్ ఉంటాయి. ముఖ్యం గా స్త్రీలకు ఇది ఒక మేలిమి బంగారం. ఇది వేడిచేసే ద్రవ్యము , పెరుగన్నము చలవ చేసే పదార్దము .
తలంటు స్నానము అనేది తలని శుభ్రం చెస్తే – గోంగూర +పెరుగు అన్నము .. పిల్లలకు హుషారు, చురుకుదనాన్ని ఇస్తుంది .
పూర్వం రోజుల్లో పొలాలకెళ్ళే రైతులంతా పెరుగన్నము గోంగూర లేదా ఆవకాయ నంజుకుని వెళ్ళిపోయి మళ్ళీ మధ్యాహ్నం రెండుగంటలకి ఆకలితో నకనకలాడుతూ వస్తూండేవారు . ఆ తీరుగా చురుకుదనాన్ని పుట్టిస్తుంది . .. ఈ భోజన మిశ్రమము .
కొన్నిచోట్ల నువ్వులపొడుం కూడా ఈ మిశ్రమములో చేరుస్తారు . దీనివల్ల శ్రావణ భాద్రపద మాసాల్లో వర్షాల కారణంగా వచ్చే జలుబు – రొంప , ముక్కు – కళ్ళ మంటలు రానేరావు .
- రెండవ రోజు —
ఉండ్రాళ్ళ తద్దె లోని ప్రత్యేకత – తెల్లవారు ఝాము భోజనాలు.
మళ్ళీ నిన్నటిలాగే – గోంగూర లేదా ఆవకాయ నంచుకుని పెరుగన్నాన్ని తిని అలసిపోయేవరకూ దాగుడుమూతలు, కోతి కొమ్మచ్చి మొదలగు ఆటలు దాదాపు ఉదయం 8 గంటలయ్యేంతవరకూ ఆడుతారు. ఉయ్యాలలూగుతారు.
అంతా అయ్యాక ఏ పిల్లకి సంబంధించిన తల్లి రాను తెచ్చిన ఉండ్రాళ్ళని ఆయా కూతురికిస్తే ఆ తల్లీ కూతురూ ఆ ఉండ్రాళ్ళని మరో తల్లీ కూతుళ్ళకిస్తారు .
ఈ సందర్భం లో ఈ కూతురు ఆ తల్లికీ , ఆ కూతురు ఈ తల్లికీ నమస్కరిస్తారు . ఇదొక తీరు ఐకమత్యాన్ని పెంపొందించుకునె తీరు — ఆట , పండుగ అంతేకాదు తర్వాత నెలలో రాబోయే అట్లతద్దికి శిక్షణ వంటిదికూడా .
ఆడపిల్లలందరూ శారీరకంగా మానసికంగా సామాజికంగా .. ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆరోగ్యవంతులుగా ఉండే నిమిత్తమే – ఈ ఆటలూ , ఉండ్రాళ్ళ వాయనాలు.
ఆడపిల్లలు చిన్నతనం నుండి ఈ నోములు వ్రతాలు పాటించడం వల్ల – ఆరోగ్యం తో పాటు మంచి వ్యక్తిత్వం, క్రమశిక్షణ, విలువలు తో కూడిన మానసిక ధృఢత్వం ఏర్పడుతుంది.
సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉండి, బియ్యం పిండితో ఉండ్రాళ్లు తయారు చేసుకోవాలి.
గౌరీ దేవిని పూజా మందిరంలో ప్రతిష్ఠించి షోడశోపచారాలతో, భక్తి శ్రద్ధలతో పూజించి, ఐదు ఉండ్రాళ్ళు గౌరీదేవికి నివేదించాలి.
(పసుపుతో చేసిన వినాయకుని, గౌరీ దేవి ని .. తమలపాకులో ఉంచి పూజిస్తారు)
గౌరి దేవి ని షొడశోపచారాలతో పూజించిన వారికి సమస్త శుభాలు సమకూరుతాయంటారు.
‘ఓం శ్రీ గౌరీ దేవ్యై నమః’ – అనే నామంతో అమ్మవారిని జపం చేసుకోవాలి.
ఐదు దారపు పోగులు పోసి, ఐదు ముడులు వేసి , ఏడుతోరాలను అమ్మవారి పక్కనే వుంచి పూజించాలి.
ఒక తోరం అమ్మవారికి, ఒకటి నోముకున్నవారికి , మిగితా ఐదు – ఐదుగురు ముత్తైదువులకు కట్టాలి.
బియ్యపు పిండిలో బెల్లము కలిపి , పచ్చి చలిమిడి చేసి , ఐదు ఉండ్రాళ్ళను చేసి , అమ్మవారికి నైవేద్యంపెట్టాలి. 5 ఉండ్రాళ్ళను ముత్తైదువలకు వాయనంగా ఇవ్వాలి.
ముత్తైదువులకు వాయనం
పూజ పూర్తయ్యాక చీర, రవికెలతో పాటు ఐదు ఉండ్రాళ్లు ఉంచిన వాయనముపై దక్షిణ తాంబూలాలు ఉంచి ఐదుగురు ముత్తైదువులకు వాయనం ఇవ్వాలి.
ఈ ఉండ్రాళ్ల తదియ నోము ఐదు సంవత్సరాలు ఆచరించిన తర్వాత నోముకు వచ్చిన వారందరికి పాదాలకు పసుపు, పారాణి రాసి నమస్కరించి, వారి ఆశీస్సులు పొంది, అక్షతలను వేయించుకోవాలి.
ఉండ్రాళ్ల తదియ వ్రతఫలం
ఈ ఉండ్రాళ్ల తదియ నోము ముఖ్యంగా పెళ్ళి కాని కన్యలు ఆచరించడం వలన విశేషమైన ఫలితాలు పొందుతారని, మంచి భర్త లభిస్తాడని శాస్త్రవచనం. అలాగే వివాహితులు ఈ నోమును ఆచరించడం వలన జీవితంలో శాంతి, సౌభాగ్యం, సంపదలు లభిస్తాయి.
పూజ తరువాత చేతిలో అక్షింతలనుంచుకొని కథచెప్పుకోవాలి. ఈ వ్రత కథ ఏమిటంటే ..
పూర్వం ఓ వేశ్య తన సౌందర్యం తో ఆ దేశపు రాజుగారిని వశపరుచుకుంది.
ఒక ఉండ్రాళ్ళ తద్దె నాడు .. రాజుగారు ఆమెను నోము నోచుకోమని కోరారు. ఆమె అహంకారముతో దైవ నింద చేసి ఆ వ్రతాన్ని ఆచరించలేదు. పలితంగా దొంగలు ఆమె సంపదనంతా దోచుకెళ్ళారు.
మహా వ్యాధి బారిన పడ్డది. తరువాత రాజ పురోహితుడి సలహాతో ఉండ్రాళ్ళ తద్దె నోము నోచుకొని, తన సంపద ని తిరిగి పొంది, ఆరోగ్యస్తురాలై శేష జీవితాన్ని ఆద్ధ్యాత్మికంగా గడిపి , మరణానంతరం గౌరీ లోకానికి వెళ్ళింది.
ఒక గర్విష్టికే ఈ నోము వలన ఇంతటి సద్గతి లభించింది కదా ! సత్ప్రవర్తన తో ఉండి నోచినవారికి ఇంక ఎంత ఉన్నతమైన పలితముంటుందో ఊహించుకొని సన్మార్గం లో నడవండి ! అనేది ఈ కథలోని నీతి.
హిందు సాంప్రదాయములో నోములు , పూజలకి పెద్ద పీటనే వేసారు.
నోము నోచుకుందాము అనుకోగానే ఇల్లు శుభ్రం చేసి,మామిడాకులు కట్టి, ముగ్గేసి, దేవుడి పీఠానికి పూలూ ఆకులు అలంకరించి , ధూప దీప నైవేద్యాల తో పూజించి
ముత్తైదువులకు తాంబూల మిచ్చి , ఆశీస్సులు తీసుకోవటము తో ఇంటికి ఓ కళ వస్తుంది. మనసు లో ఓ ప్రశాంతత ఏర్పడుతుంది.
ఇంట్లో పాజిటివ్ వేవ్స్ వచ్చినట్లుగా వుంటుంది. కుటుంబ శ్రేయస్సు ,ఆధ్యాత్మికానందం కలుగుతుంది.