ఆయుర్దాయం పెంచుకునేందుకు ఐదు సులభమైన మార్గాలు!
అసలేమాత్రం డబ్బు ఖర్చు కాని, ఓ ఐదు అలవాట్లను నిత్యం కొనసాగిస్తే ఆయురారోగ్యాలు సొంతమవుతాయని చెబుతున్నారు.
ప్రతి రోజూ కసరత్తులు చేయడం, పోషకాహారం తీసుకోవడం, ఆరోగ్యకర సామాజిక బంధాలను కొనసాగించడం, ఒత్తిడి తగ్గించుకోవడం ఆయుర్దాయాన్ని సులువుగా పెంచుకోవచ్చని అంటున్నారు.
ఆరోగ్యం, ఆయుర్దాయం కోసం పాటించాల్సిన సింపుల్ టిప్స్
- వాకింగ్‌తో అద్భుతాలు
రోజూ కనీసం 10 నిమిషాలు నడిస్తే మనిషి ఆయుర్దాయం ఏడాది మేర పెరుగుతుందని తాజాగా ఓ అధ్యయనంలో తేలింది.
ఇక 30 నిమిషాలు బ్రిస్క్ వాకింగ్ చేస్తే మహిళల ఆయుర్దాయం 1.4 ఏళ్లు, పురుషుల ఆయుర్దాయం 2.5 ఏళ్లు పెరుగుతుందని యూనివర్సిటీ ఆఫ్ లీసెస్టర్ పరిశోధకులు తేల్చారు.
60ల్లో ఉన్నవారిపై అధ్యయనం చేసి ఈ అంచనాను వెలువరించారు.
- హాబీ తప్పనిసరి..
వృత్తిగత, వ్యక్తిగత జీవితంలో ఒత్తిడుల తగ్గించేందుకు మంచి హాబీకి మించిన ప్రత్యామ్నాయం మరొకటి లేదు.
ముఖ్యంగా సృజనాత్మకతను వెలికితీసే వ్యాపకాలతో జీవితకాలం కనీసం 10 ఏళ్ల మేర పెరుగుతుందట.
ఇందు కోసం రోజులో కనీసం అరగంట సృజనాత్మక వ్యాపకాలకు కేటాయించాలని ప్రొఫెసర్ సూసన్ మాగ్సామన్ పేర్కొన్నారు. ఇతర విషయాల్లో సృజనాత్మకత కనబరిచినా ఇవే ఫలితాలు ఉంటాయన్నారు.
- రాత్రిళ్లు నిద్రకు ముందు పుస్తకపఠనం
నేటి జమానాలో చాలా మంది రాత్రిళ్లు నిద్రపోయే ముందు కాసేపు స్మార్ట్‌ఫోన్లు చూస్తున్నారు.
దీని వల్ల మెదడు సామర్థ్యం దెబ్బతిని, ఆల్జైమర్స్ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు పెరుగుతాయట.
దీనికి బదులుగా ఓ పుస్తకం చదవాలని నిపుణులు చెబుతున్నారు.
పుస్తక పఠనం లేని వారితో పొలిస్తే ఈ అలవాటు ఉన్న వారి ఆయుర్దాయం రెండు మూడేళ్లు ఎక్కువగా ఉంటోందట.
- స్నేహబంధాలు, కుటుంబసంబంధాలు
కష్టసమయాల్లో స్నేహితులు, కుటుంబసభ్యులకు మించి ఆదుకునే వారు ఎవరూ ఉండరు.
సామాజిక జీవితం సాఫీగా ఉండే స్త్రీ పురుషులు ఎక్కువ కాలం జీవిస్తున్నట్టు కూడా అధ్యయనాల్లో తేలింది.
కాబట్టి, సామాజిక బంధాలు పెంపొందించుకునేందుకు వీలైనంతగా ప్రయత్నించాలట.
- ఒంటికాలిపై నిలబడి యోగా
వయసు పెరిగే కొద్దీ శరీరంలో సమతౌల్యం తగ్గిపోతుంది.
దీన్ని నివారించాలంటే, ఒంటికాలిపై యోగా చేయడం, లేదా ఆసనాలు వేయడం చేయాలని నిపుణులు చెబుతున్నారు.
దీంతో, మెదడు, శరీరంలోని ఇతర భాగాల్లోని సెన్సార్ల మధ్య సమన్వయం పెరిగి తూలిపడటం లాంటి సమస్యలు తగ్గిపోతాయని చెబుతున్నారు.