‘భాస్కర్ శివాల్కర్’ హైదరాబాద్ నాటకరంగ ప్రియులకు చిర పరిచితమైన పేరు. నటుడిగా, దర్శకుడిగా, రచయితగా, అధ్యాపకుడిగా గత యాభై ఏండ్లలో నాటకరంగంలో అనేక ప్రయోగాలు చేశారు.
‘రంగధార’ నాటక సంస్థతో తెలుగు, హిందీ, మరాఠీ, ఇంగ్లీష్ నాటకాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన దిగ్గజ దర్శకుడు.
1940, మే 11న హైదరాబాద్ పాతబస్తీలోని శాలిబండలో జన్మించారు భాస్కర్ శివాల్కర్. ఆయన పూర్తిపేరు భాస్కర్ దత్తాత్రేయ్ శివాల్కర్.
ఐదవ ఏటనే తండ్రి మరణించడంతో బాల్యం నుంచే అనేక కష్టాలకోర్చి చదువుకున్నారు.
చిన్నప్పటి నుంచే నాటకాల పట్ల మక్కువ కలిగిన భాస్కర్ శివాల్కర్ స్కూల్లో, కాలేజీల్లో అనేక నాటక ప్రదర్శనల్లో పాల్గొంటూ గాత్రం, చిత్రలేఖనంలో డిప్లొమా పూర్తిచేశారు.
కొంతకాలం మహారాష్ట్రలో పనిచేసిన ఆయన మరాఠీలోనూ నాటకాలు రచించారు. మిత్రులతో కలిసి 1971లో ‘రంగధార’ నాటక సంస్థను నెలకొల్పారు.
తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్, మరాఠీ భాషల్లో 120కి పైగా నాటకాలకు దర్శకత్వం వహించారు.
ఆయన రూపొందించిన పలు నాటకాలు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి.
లండన్ థియేటర్ ఫెస్టివల్‌తో పాటు మహారాష్ట్ర, బెంగళూరు, కేరళ నాటకోత్సవాల్లోనూ శివాల్కర్ నాటకాలను ప్రదర్శించారు.
1983-85 మధ్య ఓయూలో పీజీ డిప్లొమా ఇన్ థియేటర్ ఆర్ట్స్ పూర్తిచేసి అక్కడే పార్ట్‌టైం లెక్చరర్‌గా పనిచేశారు. ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో లెక్చరర్‌గా చేరి ప్రొఫెసర్ హోదాలో 2002లో పదవీ విరమణ చేశారు.
సినీనటులు రాళ్లపల్లి, తెలంగాణ శకుంతల, తనికెళ్ల భరణి, శంకర్ మేల్కోటె తదితరులు శివాల్కర్ దర్శకత్వంలో రంగస్థలంపై నటించినవారే.
హైదరాబాద్ కేంద్రంగా నాటకరంగానికి ఎనలేని సేవ చేసిన భాస్కర్ శివాల్కర్‌కు రావలసినంత గుర్తింపు రాలేదన్నది నిజం. 83 ఏండ్ల వయసులో అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఈ నెల 5న ఆయన తుదిశ్వాస విడిచారు.